
నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలోని పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, ప్రతీ ఒక్కరూ సమయానికి హాజరై, బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. పల్లె దవాఖానలో అందుబాటులో ఉన్న ఔషధాల నిల్వలను, వాటి కాలపరిమితిని పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని, వాటిని వెంటనే తొలగించి సురక్షితంగా పారవేయాలని సూచించారు. అవసరమైన మందుల స్టాక్‌ను ముందుగానే సకాలంలో రీప్లేస్ చేయాలని, మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యత, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగుల సమస్యలు గురించి నేరుగా తెలుసుకున్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడితో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. ప్రతిరోజూ ఎక్కువగా వరి అన్నం తీసుకోవడం మానేసి, జొన్న, రాగి వంటి ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి పౌష్టికాహారాన్ని అందిస్తాయి. అలాగే వైద్యులు ఇచ్చే మందులను, సూచనలను క్రమం తప్పకుండా పాటించాలని సలహా ఇచ్చారు. ఆసుపత్రి ప్రాంగణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రోగులు చికిత్స కోసం వచ్చే సమయంలో శుభ్రమైన వాతావరణం ఉండటం చాలా ముఖ్యమని, పరిశుభ్రతతో పాటు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తేనే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.