నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు 4 కేటగిరీలుగా విభజించి తదనగుణంగా నిర్దేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేటగిరీ ఎ-లో 2002, 2025 రెండింటి జాబితా లోనూ ఒకే వ్యక్తి పేరు ఉన్నట్లయితే ఏ విధమైన డాక్యుమెంట్ అవసరం లేదని, ఈ చర్య స్పష్టంగా సరిపోలిన కేటగిరీగా పరిగణించబడుతుందని తెలిపారు. కేటగిరీ బి-2002 జాబితాలో పేరు లేదు, కానీ వ్యక్తి పుట్టిన సంవత్సరం 1987 కన్నా ముందు అయి ఉండాలని, అటువంటి వారు ఎన్నికల సంఘం సూచించిన 11 డాక్యుమెంట్లలో కనీసం ఒక్కటి* సమర్పించాలని తెలిపారు .కేటగిరీ సి లో 2002 జాబితాలో పేరు లేదు, వ్యక్తి పుట్టిన సంవత్సరం 1987 నుండి 2002 మధ్య (తద్వారా 18 సంవత్సరాలు కన్నా తక్కువ వయస్సు) అటువంటి వారు ఒక స్వీయ డాక్యుమెంట్, కుటుంబ సంబంధిత డాక్యుమెంట్ మర్పించాలని తెలిపారు. కేటగిరీ డి- 2002లో పేరు లేదు, 2004 తరువాత జన్మించినవారు కానీ, 2025 జాబితాలో పేరు ఉందంటే ఒక స్వీయ డాక్యుమెంట్, తల్లిదండ్రుల డాక్యుమెంట్ తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఈ నెల 24వ తేదీగా నివేదికలు సమర్పించాలని తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలని తెలిపారు. నిర్దేశిత గడుపులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను ఎన్నికల విభాగం అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవిన్యూ అమరేందర్, ఆర్డీవోలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి



