జనగామ, మన ప్రజాపక్షం :బుధవారం జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గోజాతి, గేదజాతి ఏడవ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని జాఫర్ గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామపంచాయతీ వద్ద పశు వైద్య అధికారులు ప్రారంభించారు. మొదటిరోజు 23 క్యాంపులు నిర్వహించి 522 రైతులకు సంబంధించిన 5,748 పశువులకు టీకాలు వేసారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య శాఖ అధికారి మాట్లాడుతూ 2025 అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు నెలరోజులపాటు ఈ టీకా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నాలుగు నెలలు నిండిన పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణకు టీకా వేయించాలన్నారు. పశువులకు ఈ వ్యాధి సోకకుండా సంవత్సరంలో రెండుసార్లు అనగా ప్రతి ఆరు నెలల కు ఒకసారి తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు. అంతేగాక వేయించినట్లుగా పశువులకు ట్యాగ్ వేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి పశువులకు సోకినట్లయితే ఉత్పత్తి, పునరుత్పత్తి నిలిచిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతారని, పశువులలో పాల ఉత్పత్తి తగ్గుతుందని, కాలిలో పుండ్లు ఏర్పడి వ్యవసాయ పనులకు సహకరించవని తెలియజేశారు. 2030 వరకు ఈ గాలికుంటు వ్యాధిని పశువులలో సమూలంగా పారద్రోలేందుకు, రైతాంగం సహకరించాలని, జంతు సంబంధిత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతితో మంచి ధర పలకటం ఉంటున్నందున రైతులు అమూల్యమైన పశుసంపద కాపాడుకునేందుకు ఈ సువర్ణ అవకాశం తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ దేవేందర్, పశు వైద్యులు డాక్టర్ శ్రీనాథ్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా టీకా వేయించుకోవాలి




