
ఆదిలాబాద్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్ మాట్లాడుతూ మహేంద్ర మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, వెదురు బొంగు ఉచిత సరఫరా చెయ్యాలని కోరారు. తమ కులానికి ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, టైగర్ జోన్ లో వెదురు పెంపకం చేపట్టి ఉచిత పంపిణీ చేస్తే జీవనోపాధి గడుస్తుందని స్పష్టం చేశారు. గురువారం వైశ్య భవన్ మేదరి ఏరియాలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున మేదరి కులస్థులు పాల్గొన్నారు. ఆర్థికంగా, ఉపాధి, రాజకీయంగా తమ సంఘం అభ్యున్నతి సాధించాలంటే ప్రభుత్వ అభయ హస్తం అవసరం అన్నారు. మేదరులు కేవలం కులవృత్తులపై జీవనోపాధి చేస్తున్న కారణంగా విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనుకబడుతున్నారని ప్రభుత్వ పరంగా తమకు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సతీమణి సురేఖకు, జిల్లా అటవీ శాఖ అధికారికి వినతి పత్రాలను సమావేశం అనంతరం అందజేశారు. తమ కులానికి రాజకీయంగా అందే అవకాశాలను మెరుగుపడే విధంగా చూడాలని అప్పుడే మేధర్లు సైతం రాజ్యాధికారం దిశగా పయనిస్తారని కిషన్ స్పష్టం చేశారు. వెదురు కలపతో అంచలు, తడకలు, బొంగులు, నీలగిరి కొయ్యలు, చాటల అల్లికలు, అల్లికలపై జీవనం చేసే తమకు వెదురు అందించటమే కాక డివిజన్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమ కులస్థులు వృద్ధిలోకి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి జుట్టు సుభాష్, కోశాధికారి చేర్ల సత్తయ్య, ప్రచార కార్యదర్శి అమర్నాథ్, ఉపాధ్యక్షులు రాపాల తిరుపతి, మంచిర్యాల మండల ప్రధాన కార్యదర్శి కనకయ్య, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.