దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం :రానున్న దుర్గాదేవి మరియు శారదా దేవి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన ప్రజలకు, కృషిచేసిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది అధికారికి అభినందనలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంబించనున్నట్లు అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేల కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల పరిధిలో రాజ్యాంగ విరుద్ధంగా విడీసీలు ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మించడానికి జిల్లాలోని ప్రతి ఒక్క పోలీసు అధికారి పూర్తి స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గంజాయిని అరికట్టాలని తెలిపారు. రానున్న దుర్గ నవరాత్రి మరియు శారదా దేవి ఉత్సవాలలో మండలాల పరిధిలోని ప్రతి ఒక్క గ్రామాలలో కమిటీ సభ్యులచే సమావేశాలు ఏర్పాటుచేసి డీజీలను ఏర్పాటు చేయరాదని, రాత్రి సమయాలలో మండపాలలో మగ వ్యక్తులు ఉండేలా చూసుకోవాలని, మహిళలకు రక్షణగా షీ టీం బృందాలు ఈవ్ టీజింగ్ జరగకుండా పర్యవేక్షిస్తుంటాయని, ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలియజేయాలన్నారు. ప్రజలకు విద్యార్థులకు చట్టం పట్ల నేరాల పట్ల భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించే విధంగా ప్రజలతో విద్యార్థులతో సత్సంబంధాలను మెరుగుపరిచే విధంగా నూతన కార్యక్రమాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా ట్రాఫిక్ సైబర్ లపై అవగాహన కార్యక్రమాలు, ఆంటీ డ్రగ్ క్లబ్, మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళ, రోడ్ సేఫ్టీ క్లబ్, కాకి కిడ్స్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఆదివాసి యువతకు త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ఏర్పాటు చేసి మారుమూల ఆదివాసి గిరిజన యువకులకు లైసెన్సును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు. రౌడీలు సస్పెక్ట్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన చర్యలతో కట్టడి చేయాలని సూచించారు. ప్రజలను వడ్డీ పేరుతో నడ్డి విరిచే వ్యాపారుల పట్ల చట్ట ప్రకారం కఠినమైన చర్యలతో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది సిబ్బంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించడం జరిగింది. రాత్రి సమయాలలో ఫింగర్ ప్రింట్స్ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ అనవసరంగా తిరిగి వారిని కట్టడి చేయాలని నేరస్తులను పట్టుకునేందుకు కనుగొనేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులు దర్యాప్తు కేసుల పురోగతిపై ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సీహెచ్ నాగేందర్, హాసీబుల్ల, కమతం ఇంద్ర వర్ధన్, ఆదిలాబాద్ జిల్లా సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు డిసిఆర్బి, ఎన్ఐబి, ఐటి కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *