జనగామ, మన ప్రజాపక్షం :జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి తెలిపారు. మొత్తం 403.26 మెట్రిక్ టన్నులు (ఎంటిఎస్) యూరియా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, ప్రైవేట్ కేంద్రాలు మరియు రవాణాలో ఉంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మండలాల వారీగా యూరియా నిల్వలు బచ్చన్నపేట మండలం 41.40, చిల్పూర్ మండలం 48.98, దేవరుప్పుల మండలం 20.00, ఘనపూర్ (స్టేషన్) మండలం 25.00, జనగాం మండలం 44.00, కోడకండ్ల మండలం 15.00, లింగాలఘనపూర్ మండలం 37.00, నర్మెట్ట మండలం 27.88, పాలకుర్తి మండలం 25.00, రఘునాథపల్లి మండలం 56.00, తరిగొప్పుల మండలం 28.00, జాఫర్‌గఢ్ మండలం 35.00, జిల్లా వ్యాప్తంగా మొత్తం లభ్యత 403.26 ఎంటిఎస్. ప్రస్తుత పంట దశ మరియు యూరియా అవసరం. యూరియా వాడకం ఎక్కువగా వరి పంటలోనే ఉంటుంది. మొదటి మోతాదు (బేసల్ డోస్) సాగు సమయంలోనే వేశారు. రెండవ మోతాదు సాధారణంగా ట్రాన్స్‌ప్లాంటింగ్ అయిన 20–25 రోజులకు ఇస్తారు. మూడవ మరియు చివరి మోతాదు 40–45 రోజులకు (టిల్లరింగ్ దశ పూర్తి అయ్యే సమయంలో) ఇస్తారు. జిల్లాలో చాలా మంది రైతులు ఇప్పటికే రెండవ మోతాదు పూర్తిచేశారు. ముందుగా విత్తిన పొలాల్లో ఇప్పుడు మూడవ మరియు చివరి మోతాదు అవసరం ఉంది. ఆలస్యంగా నాటిన పొలాల్లో మాత్రం ఇది రెండవ మోతాదు దశలో ఉంది. యూరియా అవసరం తుదిదశ వద్దకు చేరుకోవడం వల్ల డిమాండ్ తగ్గుతూ వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న నిల్వలు జిల్లాకు సరిపడేలా ఉంటాయి. యూరియా వాడకం పంట దశకు అనుగుణంగా మాత్రమే చేయాలి. అధిక మోతాదులో యూరియా వాడకూడదు. ఇది పంటలో కేవలం ఆకుకూర పెరుగుదలకే ఉపయోగపడుతుంది కానీ ధాన్యం ఉత్పత్తిని పెంచదు. పొలంలో మట్టిలో తగిన తేమ ఉన్నప్పుడే యూరియా వేయాలి. పొడి నేలలో వేస్తే ఫలితం తగ్గిపోతుంది. జింక్ సల్ఫేట్, పొటాష్ వంటి ఇతర ఎరువులతో సమన్వయం చేసి వాడితే పంట దిగుబడి మెరుగవుతుంది. మూడవ మోతాదుతో యూరియా వినియోగం దాదాపు పూర్తవుతుందని రైతులు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా యూరియా నిల్వలు తగిన మోతాదులో అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆందోళన చెందకుండా తమ తమ గ్రామాలకు కేటాయించిన కేంద్రాల ద్వారా యూరియా పొందవచ్చు. పంట దశను బట్టి రెండవ లేదా మూడవ (చివరి) మోతాదు వేసుకొని పంట ఉత్పత్తి మెరుగుపరచుకోవాలి.
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు