హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులకు ‘ముగ్గురు పిల్లల’ నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను తొలగించినా, తెలంగాణలో మాత్రం దీనిని యథాతథంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబర్ 11 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ కఠిన నిబంధన నుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు ఉన్నాయి. చట్టంలోని కొన్ని వెసులుబాట్ల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కొందరు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హత సాధించవచ్చు.
నిబంధన నుంచి మినహాయింపులు ఇవే…
1995 మే 31వ తేదీకి ముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఆ తేదీ తర్వాత మూడో సంతానం కలిగి ఉంటే మాత్రం అనర్హులవుతారు. 1995 మే 31కి ముందు ఒక బిడ్డ ఉండి, ఆ తర్వాత కాన్పులో కవలలు పుట్టినా (మొత్తం ముగ్గురు పిల్లలు) వారు పోటీకి అర్హులే. కానీ, అదే తేదీకి ముందు కవలలు పుట్టి, తర్వాత ఒక బిడ్డ పుడితే మాత్రం అనర్హులుగా పరిగణిస్తారు. 1995 జూన్ 1 తర్వాత రెండో కాన్పులో కవలలు జన్మించినా లేదా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా వారు పోటీ చేసేందుకు అర్హులు. నామినేషన్ల పరిశీలన నాటికి ముగ్గురు పిల్లలలో ఒకరు మరణిస్తే, జీవించి ఉన్న పిల్లల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అర్హత కల్పిస్తారు. నామినేషన్ల పరిశీలన సమయానికి ఇద్దరు పిల్లలు ఉండి, అభ్యర్థి (మహిళ) గర్భవతిగా ఉన్నా పోటీకి ఎలాంటి ఆటంకం ఉండదు. జీవించి ఉన్న సంతానాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఈ మినహాయింపులతో కొంతమంది ఆశావహులకు ఊరట లభించనుండగా, చాలా మంది మాత్రం ఈ నిబంధన కారణంగా స్థానిక రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి:
1. ఈవీఎం గోదాము తనిఖీ, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరు పరిశీలించిన కలెక్టర్
2. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య