అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు

  • మంత్రి సీతక్క

ఖమ్మం, మన ప్రజాపక్షం : తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రం బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.యూరియా సరఫరా అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలను వక్రీకరించి, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతోందని ఆమె ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి విమర్శించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీతక్క వివరించారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆమె కోరారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *