నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, చదువుతోపాటు క్రీడలను సమానంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. క్రీడలలో విజయం సాధించడం మాత్రమే కాదు, క్రీడా విలువలను ఆచరించడం కూడా విద్యార్థుల జీవితానికి ప్రేరణ కావాలి, అని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు.
ఇటీవల జడ్చర్ల బాదేపల్లి వేదికగా జరిగిన ఉమ్మడి జిల్లా అండర్-17 వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికైన నాగర్‌కర్నూల్ జిల్లా విద్యార్థులను బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యత పొందాలని అన్నారు. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి కోసం క్రీడలు అత్యంత అవసరమని ఆయన తెలిపారు. క్రీడల ద్వారా విద్యార్థులు మానసికంగా చురుకుగా, శారీరకంగా దృఢంగా మారతారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం వ్యాయామ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ప్రతి పాఠశాలలో క్రమం తప్పకుండా క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులలో పోటీ ఆత్మను పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని, ఇవి విద్యార్థుల భవిష్యత్తులో విజయానికి పునాదులవుతాయని ఆయన తెలిపారు. అలాగే, రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచి నాగర్‌కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నదని, క్రీడల విషయంలోనూ అవసరమైన పరికరాలు, ప్రోత్సాహకాలు అందజేయబడతాయని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రతి పాఠశాల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి, ప్రతిభావంతులను గుర్తించి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి పంపే దిశగా విద్యాశాఖ, వ్యాయామ ఉపాధ్యాయులు చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. క్రీడలలో విజయం సాధించడం మాత్రమే కాదు, క్రీడా విలువలను ఆచరించడం కూడా విద్యార్థుల జీవితానికి ప్రేరణ కావాలి, అని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన ఉమ్మడి జిల్లా అండర్-17 వయస్సు గల విద్యార్థుల వాలీబాల్ టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా బాలురు, బాలికలు ద్వితీయస్థానం సాధించారు. వీరిని సంగారెడ్డిలో జరగబోయే 69వ SGF రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి పాండు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు వరప్రసాద్, నితిన్, రఘువీర్, శ్రీలేఖ, మైత్రి, ప్రియాంకలను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. వీరు జిల్లా పరిషత్, ఎంజెపి గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ. రమేష్ కుమార్, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి పాండు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, జిల్లా టెక్స్ట్‌బుక్స్ ఇన్‌ఛార్జ్ నర్సింహులు, ఉపాధ్యాయులు మనీ, అరుణ, తులసి, శివ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలి