Site icon Mana Prajapaksham

తహశీల్దార్లు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓ లతో,20 మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రభుత్వ భూముల పరిరక్షణ,అసైన్డ్ భూముల, భూదాన్ భూముల పరిరక్షణ, పలు రెవిన్యూ అంశాలపై కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల వారీగా రెవిన్యూ అంశాలను తాహసిల్దార్లు నిర్లక్ష్యం వహించకుండా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్షేత్రస్థాయిలో రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా తాహసిల్దార్లు తమ విధుల పట్ల అంకిత పవన్ తో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం తప్పనిసరి అని, ప్రజలకు సమయానుసారంగా సేవలు అందించడానికి కలెక్టర్ స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం రూపుదిద్దుకుంది అని సమస్యల పరిష్కారం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. తిరస్కరించబడిన ప్రతి దరఖాస్తుపై సరైన కారణాలు తెలియజేయాలని, తహసిల్దార్లు ఆ తిరస్కరణ వివరాలతో ప్రొసీడింగ్‌ను దరఖాస్తుదారుడికి అందజేయడం తప్పనిసరి అని తెలిపారు.మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. సాదా బై నామాల వివరాలను మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించి చర్చించారు. ప్రతి మండలంలో ఉన్న సాదా బై నామాల సంఖ్య, వాటి ప్రస్తుత స్థితి, చట్టపరమైన సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావలసిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. హైకోర్టు, సివిల్ కోర్టు, లోకాయుక్తకు సంబంధించిన కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసిన ఆదాయ, కుల ధృవీకరణ, రెసిడెన్సీ వంటి సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ఆమోదం తెలపాలని సూచించారు. ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, వాటి నిర్మాణానికి కావలసిన ఇసుకను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాను సక్రమంగా నిర్వహించడానికి రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయం చేసుకోవాలి అని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రెవిన్యూ అంశాలపై అధికారులు ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు జనార్దన్ రెడ్డి, బన్సీలాల్, సురేష్ , మాధవి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరిండెంట్లు రవికుమార్, వెంకట్, శోభా తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version