సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు షాక్… ప్రోటోకాల్ వివాదంలో నోటీసు, కోర్టు ధిక్కరణ కేసులో వారెంట్

రాజన్న సిరిసిల్ల, మన ప్రజాపక్షం : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఒకే రోజు అటు ప్రభుత్వం నుంచి, ఇటు హైకోర్టు నుంచి ప్రతికూల చర్యలు ఎదుర్కోవడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు వారెంట్ జారీ చేసింది.వివరాల్లోకి వెళితే, నిన్న జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆయన స్వాగతం పలకకపోవడం వివాదానికి కారణమైంది. కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్, ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, ప్రోటోకాల్ వివాదంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ ఝాను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.అంతకుముందే, ఆయనకు హైకోర్టు నుంచి షాక్ తగిలింది. మిడ్ మానేరు ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోయిన చీర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల ఎల్లయ్య అనే నిర్వాసితుడికి నష్టపరిహారం చెల్లించడంలో కోర్టు ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్‌కు నిన్న నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *