Site icon Mana Prajapaksham

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Public service applications should be resolved quickly.

Public service applications should be resolved quickly.

నిర్మల్, మన ప్రజాపక్షం ప్రతినిధి : సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి వెంటనే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్త్ నారి – స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు రక్తహీనత, బిపి, థైరాయిడ్, టిబి, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నిపుణ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరగనున్న పోషణ్ మా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి ఎనీమియా ముక్త నిర్మల్ సాధించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ వందశాతం హాజరు కావాలన్నదే తమ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version