Site icon Mana Prajapaksham

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ ఆగ్రహం

హైదరాబాద్, మన ప్రజాపక్షం :మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను పొన్నం ప్రభాకర్ “దున్నపోతు” అని సంబోధించడం దారుణమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ ఖండించకపోగా, సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ మీద పొన్నం చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దళితులు, బలహీనవర్గాల మధ్య వివాదం పెరగడం మంచిది కాదనే ఉద్దేశంతో తాను వెంటనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫోన్ చేశానని తెలిపారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని చూస్తున్నామని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పే వరకు సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి లక్ష్మణ్ రాలేదని మాట్లాడటం ఏమిటని నిలదీశారు. ఆ శాఖలో పొన్నం, వివేక్ జోక్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శాఖల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పొన్నం అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వివేక్ వారించాల్సిందని అన్నారు. లక్ష్మణ్ ఆలస్యంగా వస్తే మేం ఉండలేమని వారు చెప్పారని, కానీ వారిని రమ్మన్నది ఎవరు, వెళ్లమన్నది ఎవరని మండిపడ్డారు. లక్ష్మణ్‌ను వివేక్ గతంలోనే అవమానించారని, తన తండ్రి కాకా 96వ జయంతి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించలేదని విమర్శించారు. తోటి మాల సోదరుడు తోటి మాదిగ మంత్రిని ఆహ్వానించకపోతే ఎలాగని ప్రశ్నించారు.

Exit mobile version