మంచిర్యాల, మన ప్రజాపక్షం :సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు లతో కలిసి పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టిక ఆహారం పై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులు తమ వివరాలు నమోదు చేసుకుని, సమయానుసారంగా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించడంతో పాటు వారి ఇండ్లలోని మగవారికి పాటించవలసిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో అందించాలని తెలిపారు. సూపర్ వైజర్లు తమ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలని, మూత్రశాలలు లేని అంగన్వాడి కేంద్రాలను గుర్తించి ఉపాధి హామీ పథకం క్రింద ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పోషణ మాసం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించి పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి సుధాకర్, సిడిపిఓ విజయ, రజిత, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త సౌజన్య, జిల్లా ప్రాజెక్టు సహాయకులు మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం




