నాగర్ కర్నూల్, మన ప్రజాపక్ష : బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో న్యాయవాది సాయికుమార్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాది సాయికుమార్ రాత్రి ఇంట్లో నిద్రస్తుండగా గుర్తు తెలియని దుండగులు మూసి ఉంచిన ఇంటికి బయటి నుండి గొల్లం పెట్టి వైరుని బిగించి తలుపు తెరవకుండా చేశారు. ఆ తర్వాత మిద్దె పైనుండి ఇంట్లోకి పెట్రోల్, కిరోసిన్ పోయడంతో పాటు తలుపులకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సాయికుమార్ తన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తున్న సందర్భంగా దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంటి నిండా పొగ చూడడంతో పాటు మంటలు కూడా అల్లుకున్నాయి. అప్రమత్తమైన సాయికుమార్ తలుపు తెరిచే పరిస్థితి లేకపోవడంతో మిద్దెపై ఉన్న గూన సహాయంతో ఇంట్లో నుండి బయట ప్రాంతానికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ సంఘటనపై బాధితుడు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి డిఎస్పి శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.
విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన న్యాయవాదులు