Site icon Mana Prajapaksham

అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత

Kavitha Hyd

Kavitha Hyd

హైదరాబాద్, మన ప్రజాపక్షం :బండారు దత్తాత్రేయ అంటే బీజేపీ నాయకుడిగానో, గవర్నర్‌గానో కాకుండా పదిమందిని కలుపుకుని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్-బలయ్’ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, 20 ఏళ్లుగా దత్తాత్రేయ రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.దత్తాత్రేయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తాను రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో దత్తాత్రేయ గురించి చాలామంది తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఏదైనా పని కోసం దత్తన్న వద్దకు వెళితే వారి సమస్య కచ్చితంగా పరిష్కారమయ్యేదని అన్నారు.పండుగ అంటేనే పదిమంది కలవడమని, పండుగ అంటే పదిమందితో ఆనందాన్ని పంచుకోవడమని కవిత అన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే ఇలాంటి వేదికను ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కవిత అన్నారు. విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.

Exit mobile version