Site icon Mana Prajapaksham

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా పూర్తి చేయించాలి

జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ప్రగతి సాధించాలన్నారు. జిల్లాలో 28,975 ఇందిరమ్మ ఇండ్లు చేపట్టడం జరిగిందన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు లబ్ది దారులకు కావాల్సిన సామగ్రి ఇసుక, కంకర, సిమెంట్ ధరలను లబ్దిదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయిస్తూ 100% ప్రగతి సాధించాలని, ఈనెల 30వ తేదీ లోపు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా చేపట్టేందుకు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిరుపేదలకు నీడ కల్పించాలని గొప్ప ఉద్దేశంతో, పారదర్శకతతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్లను పూర్తి చేయించడంలో లబ్ధిదారుల వెంట ఉండి ప్రోత్సహిస్తూ గృహ నిర్మాణాలను వేగవంతం చేయించాలన్నారు. ఇండ్ల నిర్మాణాలలో జాప్యం తగదని సాంకేతిక సమస్యలుంటే తక్షణం పరిష్కరిస్తూ లబ్ధిదారులకు ఖర్చు తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ గూగుల్ మీట్ లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాతృ నాయక్, మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version