- విద్యార్థుల అభ్యసన ప్రగతికి కృషి చేయాలి
జనగామ, మన ప్రజాపక్షం: స్థానిక సాయిరాం కన్వెన్షన్ నందు 12 మండలాలకు చెందిన మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు జిల్లా స్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరయ్యారు. టిఎల్ఎమ్ ఎగ్జిబిట్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, పరిసరాల విజ్ఞానము సంబంధించి ప్రతి మండలానికి పది చొప్పున మొత్తం 120 ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. వాటిలో గణితానికి సంబంధించిన కొన్ని ఎగ్జిబిట్స్ ను ఇంచార్జి కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకుని వాటిని తయారు చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చాలా నిష్ణాతులని వారు బోధన అభ్యసన ప్రక్రియలో టిఎల్ఎమ్ ఉపయోగించి సమర్థవంత బోధన చేస్తారని కొనియాడారు. చాలా ఎగ్జిబిట్స్ సంబంధించిన వాటిని ప్రతినిత్యం తరగతి గదిలో ప్రదర్శించి విద్యార్థులకు ఇంట్రెస్ట్ ను కలగజేయాలని తెలియజేశారు. ప్రాథమిక స్థాయిలో కృత్యాల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని వాటిని డిజిటలైజేషన్ చేసి వాటి ద్వారా నేర్పిస్తే సులభంగా ఇంకా ఎక్కువ నేర్చుకుంటారని తెలియజేశారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరూ టెక్నాలజీని అందిపుచ్చుకొని వాటిని ఉపయోగిస్తూ టిఎల్ఎమ్ తయారుచేసి పాఠశాల తరగతి గదిలో బోధన చేసినట్లయితే 100% పిల్లలు నేర్చుకుంటారన్నారు. పిల్లల స్థాయికి ఇంట్రెస్ట్ కు అనుగుణంగా టిఎల్ఎం తయారుచేసి అన్ని ప్రాథమిక తరగతి లకు సమర్థవంతంగా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు స్వంతంగా తయారుచేసిన గణితం, తెలుగు, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన బోధనభ్యసన సామగ్రి ను పరిశీలించి ఈ టిఎల్ఎమ్ మెటీరియల్ ను తరగతి గదిలో ఉపయోగించి విద్యార్థుల అభ్యసన ప్రగతికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ మేళాలో ప్రదర్శించిన అన్ని ఎగ్జిబిట్స్ ను వీడియోలుగా రూపొందించి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అందుబాటు ఉంచాలని అపుడు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు మంచి అవగాహనతో వారి తరగతి స్థాయి అభ్యసన పలితాలు సాధిస్తారని అన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ మైన వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎమ్ మేళా ప్రోగ్రామ్ ఇంచార్జి ఏఎమ్ఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రఘుజీ, డా.వెంకటేశం, రాజపాల్ రెడ్డి, సుధాకర్, రాజేంద్రకుమార్, ఉపాధ్యాయులు వసంత,పద్మ, హిమబిందు,రాంబాబు పాల్గొనగా డా.అనిత, డా.దుర్గాప్రసాద్, డా.నరసింహారావు, ఝాన్సీ లక్ష్మీ భాయ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.