నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు ఘనవిజయవంతంగా ముగిశాయి. జిల్లాలోని పలు ప్రభుత్వ, జెడ్‌పి, మోడల్ మరియు కేజీబీవీ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రతిభను ఉజ్వలంగా ప్రదర్శించారు. ఈ పోటీల్లో విద్యార్థులు 11 విభిన్న థీమ్‌లలో పాల్గొని ప్రజా సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. ప్రతి బృందం తమ గ్రామీణ సంప్రదాయాలు, జానపద వేషధారణలు, సంగీతం, నృత్య చాతుర్యంతో ప్రేక్షకులను అలరించింది. వేదిక మొత్తం రంగుల హరివిల్లు మాదిరిగా కళాకళలతో నిండిపోయింది. మొదటి బహుమతి డి.లావణ్య అండ్ గ్రూప్ పీఎం శ్రీ జెడ్‌పిహెచ్‌ఎస్ దామరగిద్ద, రెండవ బహుమతి, కేజీబీవీ నర్వ, మూడవ బహుమతి ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, నారాయణపేట వారు గెలుపొందారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న బృందం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయబడింది. జిల్లా స్థాయిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయాలి. ఈ రకమైన పోటీలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, జీవిత ఒత్తిడిని అధిగమించే శక్తిని ఇస్తాయి. కళలు మానసిక వికాసానికి మార్గం చూపుతాయి,” అని చెప్పారు. అలాగే ఆయన విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని, రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రతిభ ప్రతిధ్వనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్, ఉపాధ్యాయులు కనకప్ప, పర్వీన్ బేగం, లక్మన్, కథలప్ప తదితరులు హాజరయ్యారు. వేదికపై విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పల్లె జానపద వేషధారణలు, సాంప్రదాయ వాద్యాలు, గాన నృత్య సమన్వయం అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమం సమగ్ర శిక్ష పథకంలోని విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబించింది. విద్యార్థులలో సాంస్కృతిక అవగాహన, బృంద సహకారం, సృజనాత్మకత పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. జిల్లా విద్యా అధికారుల సమన్వయంతో జరిగిన ఈ పోటీలు విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక వేడుకను విజయవంతం చేశారు.
కళా కాంతులతో మెరిసిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు