Site icon Mana Prajapaksham

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ,మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం న్యాయమైన మద్దతు ధర పొందేలా ప్రతి అధికారి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో రెండు లక్షల 75 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగిందని, 33 లక్షల క్వింటాళ్ల కాటన్ దిగుబడి కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా, రైతులు ఇచ్చిన పత్తి బరువు ఖచ్చితంగా నమోదు కావాలని ఆయన ఆదేశించారు. అలాగే రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా సకాలంలో జరగాలని, ఇందుకోసం పారదర్శక వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, వసతి, తూకం యంత్రాలు, గోదాములు వంటి సదుపాయాలు సమగ్రంగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్పష్టంచేశారు. అంతేకాకుండా పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీ ప్రతి మండలంలో పత్తి సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి, వాస్తవ ఉత్పత్తి వివరాలను సేకరించి ఖచ్చితమైన సగటు లెక్కించనుంది. రాష్ట్ర సగటు దిగుబడికి 10 శాతం మించి ఉంటే, ఆ వివరాలు ప్రత్యేక ధ్రువీకరణ తర్వాత మాత్రమే ఆమోదం పొందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని మధ్యవర్తులు లేదా అక్రమంగా పత్తి కొనుగోలు చేసే వారి ప్రభావానికి లోనుకాకూడదని కలెక్టర్ సూచించారు. పారదర్శకమైన విధానాల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం అందించే మద్దతు ధర వారి చేతుల్లోకే చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా మార్కెటింగ్ అధికారి సిరంజిత్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version