Site icon Mana Prajapaksham

నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సంబంధిత తహసీల్దార్ల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై విచారణ చేసి, భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. ప్రభుత్వ భూముల వివరాలు సక్రమంగా అప్‌డేట్ చేసి ఉంచాలని సూచించారు. 2002లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉన్న 189 పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం 270 కేంద్రాలుగా పెరిగిన నేపథ్యంలో, ఆయా కేంద్రాల్లోని ఓటర్ల జాబితాను సరిచూసి, మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్డీవోకు ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి, స్పష్టమైన వివరాలను అందించాలన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3888 దరఖాస్తులపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఎన్ని అర్జీలు పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు జారీ చేశారు, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందా వంటి అంశాలను ఆర్డీవో అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.సాధా బైనామా, పీఓటీ వంటి అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంటవెంటనే నోటీసులు జారీ చేయాలని, క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులకు ఆమోదం తెలపాలని ఆయన అధికారులు సూచించారు. కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ ఆర్డీవో సురేష్, డిటి రాములు, రమేష్ తదితరులు ఉన్నారు.

Exit mobile version