Site icon Mana Prajapaksham

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. శీను అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (ఎంఎస్పీ) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26 లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ మండలాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అంచనా ఉత్పత్తి వివరాలు సేకరించి వాస్తవికంగా సగటు దిగుబడిని లెక్కించనుందని తెలిపారు. రాష్ట్ర సగటు కంటే 10శాతం మించితే ప్రత్యేక ధ్రువీకరణతో మాత్రమే ఆమోదం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు సహకరించి కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డీఆర్డిఓ మొగులప్ప, డిపీఎం సుధాకర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version