నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై అధికారులు మరియు సంబంధిత శాఖలతో సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పనుల పురోగతిపై మండలాల వారీగా ఎంపీడీవోలు, ఎంపీఓలు, హౌసింగ్ విభాగానికి చెందిన ఏఈలు, ఏపీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాల వల్ల ప్రారంభం కాని చోట్ల, అర్హులైన కొత్త లబ్దిదారులను గుర్తించి ఇళ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమాచారం ఇందిరమ్మ కమిటీల ద్వారా కొత్త లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ తమ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి జాబితాలు తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాల అమలు వేగవంతం కావాలని, లబ్ధిదారులకు సమయానికి ప్రయోజనాలు చేరేలా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధికారులు పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులను నిర్లక్ష్యం చేయడం, సమయానికి నివేదికలు అందించకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వంటి అంశాలపై కలెక్టర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకుని పనితీరులో మార్పు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడి సంగప్ప, పిడి డిఆర్డిఎ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు