బిజినపల్లి, మన ప్రజాపక్షం : రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్ చైర్మన్ మరియు సెక్రెటరీ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం గురించి అవగాహన కల్పించడానికి లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ నాగర్ కర్నూల్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జెడ్పి హెచ్ఎస్ హై స్కూల్ శాయిన్ పల్లి, నందు 15- 10-2025 నాడు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరామ్ ఆర్య, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల గురించి వివరిస్తూ బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి చదువుకోవాలి అన్నారు. బాల బాలికలందరూ ఫోన్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలని ఫోన్లో వచ్చిన మెసేజ్ లకు గాని వీడియోలను గాని ప్రతిదానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం గానీ వాటికి తిరిగి రిప్లై ఇవ్వడం గాని చేయరాదని అన్నారు. విద్యార్ధులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత స్థితిని పొందాలని అన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు ఫోక్సో చట్టం అడ్డుకట్ట వేస్తుందని అమ్మాయిలు అందరూ తమకు ఏ విధమైన సమస్యలు ఉన్న షీ టీం కు గాని, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 కు గాని సమాచారం ఇవ్వాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయం కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం గురించి అవగాహన




