కాలేశ్వరం మరమ్మతులు.. రంగంలోకి ప్రభుత్వం

కాళేశ్వరం, మన ప్రజాపక్షం :కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగమందుకుంది.జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సిఫార్సుల మేరకు ఈ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. దీని ప్రకారం, వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు.అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సమయం వృథా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్తోంది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలను పూర్తి చేయాలని భావిస్తోంది. తద్వారా అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములను చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *