నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ముస్లిం ఖబ్రస్తాన్ వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి నేటికీ చెరువును తలపించే విధంగా వర్షపు నీరు నిలిచి ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క దట్టమైన చెట్లు, ముళ్ళపోదలు మరో పక్క వర్షపు నీరుతో స్మశాన వాటిక బురదమయంగా మారింది. దీంతో సమాధులను దర్శించడానికి వెళ్లేవారికి అంత్యక్రియలు జరపడానికి అవరోధంగా ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన వారిని సైతం వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ఖననం చేయడానికి వీలు లేకుండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో వేరే చోటా ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వక్ఫ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ కార్యాలయం వెనక భాగం లోనే ఈ దుస్థితి ఉందంటే పాలక కమిటీ పనితీరు ఏ తీరులో ఉందో అర్థమవుతుందని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిత్యం పక్క కార్యాలయం వద్ద ఉండే వక్ఫ్ కాంప్లెక్స్ ఉద్యోగులు, కమిటీ సభ్యులు పాలకమండలి దృష్టికి తీసుకు వెళ్లడం లేదా అనే ప్రశ్న సర్వత్ర ఉత్పన్నమవుతుంది. దుకాణాలోకి వర్షపు నీరు చేరుతుందని జెసిబితో సుభాష్ చికెన్ సెంటర్ పక్క నగల నీరు వెళ్లే దారి వద్ద జెసిబి తో తవ్వి మోటార్ ద్వారా నీటిని ఒక్కరోజు ఎత్తిపోసి తర్వాత అటువైపుకు కమిటీ వారు తిరిగి చూడడం లేదని దుకాణదారులు వాపోతున్నారు. శాశ్వతంగా ఖబ్రస్తాన్ లో నీటిని నిలవకుండా చేయాలని దుకాణదారులు కోరుతున్నారు. దీంతోపాటు తమ కుటుంబ సభ్యుల సమాధులు నీటిలో మునిగిపోయి అపవిత్రంగా మారాయని నీటిని నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ముస్లింలు కోరుతున్నారు. వక్ఫ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ సంఘం వారు పర్యవేక్షించాల్సీ ఉండగా పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదే కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి సొంత అక్క చనిపోతే వారి కుటుంబ సభ్యుల పక్కన ఖననం చేయాల్సి ఉండగా నీరులేని వేరేచోట విధి లేని పరిస్థితులలో అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని తెలిసింది. ఖబ్రస్తాన్ ప్రాంగణంలో వర్షపునీరు నిలుస్తుండడంతో వర్షాకాలం తో పాటు ఆ తర్వాత కూడా ఆ ప్రాంతాలలో సమాధులను తవ్వడానికి వీలు లేకుండా నీటి ఊట వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ వారు చొరవ చూపి ఖబ్రస్తాన్ లో నీరు నిలవకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చెరువును తలపిస్తున్న నాగర్ కర్నూల్ ఖబ్రస్తాన్




