గద్వాల, మన ప్రజాపక్షం :మహీంద్రా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలై 56 శాతం దివ్యాంగుడిగా మారిన ఎర్రవల్లి మండలం దాసరి బీచుపల్లిని యాజమాన్యమే ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. గత తొమ్మిది రోజులుగా జిల్లా కేంద్రంలోని మహేంద్ర షోరూం దగ్గర రిలే నిరాహారదీక్ష చేస్తున్న భాధిత కుటుంబానికి ఆయన పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో బీచుపల్లి మహేంద్ర షో రూమ్ నుండి నాలుగు చక్రాల వాహనాన్ని కొనుగోలు చేయగా దానిలో సమస్య ఉందని పలుమార్లు షోరూమ్ కు వచ్చిన యాజమాన్యము కనికరించకపోవడంతో రోడ్డు ప్రమాదానికి గురై కుడి చేయి పనిచేయడం లేదన్నారు. ఫలితంగా 56% ఉన్న దివ్యాంగుడుగా మారాడని ఆయన అన్నారు. తనకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు నూతన వాహనాన్ని యాజమాన్యమే ఇవ్వాలని తొమ్మిది రోజులుగా షోరూం ముందర కుటుంబ సభ్యులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కనీసం యాజమాన్యం కనికరించకుండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్న మహేంద్ర షో రూమ్ పై కేంద్ర ప్రభుత్వము నిషేధం విధించాలన్నారు. లేదంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని మహేంద్ర షో రూమ్ నడుస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వము కంపెనీపై నిషేధం విధించాలన్నారు. సామాన్య ప్రజల ప్రాణాలతో మహేంద్ర కంపెనీ చెలగాటమాడుతుందని ఆయన అన్నారు. తక్షణమే మహేంద్ర షోరూం బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు నూతన వాహనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్, గద్వాల అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఆకేపోగు వెంకట్, ఎర్రవల్లి మండల బీఎస్పీ అధ్యక్షుడు ధర్మవరం రాముడు, జిల్లా బివిఎఫ్ కన్వీనర్ నగేష్ ఇతరులు పాల్గొన్నారు.
దేశంలో మహేంద్ర కంపెనీపై నిషేధం విధించాలి


