జనగామ, మన ప్రజాపక్షం :జిల్లాలోని రైతులకు రెండవ పంటకు సాగు నీరు, యూరియా కొరత లేకుండా అందిస్తామని నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మనందరం హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేయాలనీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో నీటిపారుదల పనులు, యూరియా పంపిణీ లపై జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ సుధీర్ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. చుక్క నీరు కూడా వృధాకాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దేవాదుల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వృధాకాకూడదని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల వారీగా సమీక్షిస్తూ ఆయా పరిధిలో చెరువులు కుంటలు నింపాలని ఇప్పటికే వర్షంతో నిండిన చెరువుల నీరు వృధా కాకుండా షటర్లు నిర్వహణ చేపట్టాలని తెలిపారు. నీటి నిర్వహణ తప్పనిసరిగా తెలియజేస్తూ నీటి పారుదల ఇంజనీరింగ్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోని కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో యూరియా పంపిణీ కై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ప్రశంసించారు. ఇలాగే 10రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో యూరియా పంపిణీ ప్రశాంతంగా కొనసాగించాలన్నారు. అధికారుల సహకారంతో తన నియోజకవర్గంలో రెండో పంటకు సాగునీరు అందిస్తానని యూరియా కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులను కోరారు. రాష్ట్రంలోనే జనగామ జిల్లాకు మంచి పేరు తేవాలని అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు గోపి రామ్ డి.ఎస్ వెంకన్న, వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోనీ తహసిల్దార్లు, ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం ఉంది




