దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

బాసర, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా బాసర మండలంలోనీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం అమ్మవారిని ప్రార్థించిన కలెక్టర్‌కు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం అందించి, సాంప్రదాయరీతిలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆలయ పరిసరాలను అధికారులు, పూజారులతో కలిసి పరిశీలించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. క్యూ లైన్లు, వి ఐ పి క్యూ లైన్స్, అక్షరాభ్యాసం మండపాలు, దర్శనం, లడ్డు కౌంటర్లు, సీసీటీవీ కెమెరాలు, అన్నదానం, తాగునీరు, వసతి వంటి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్, సెక్యూరిటీ, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. లైటింగ్, పార్కింగ్, పూల అలంకరణ, పెయింటింగ్, నిరంతరం సానిటేషన్, మొబైల్ టాయిలెట్, వైద్య శిబిరం, పోలీస్ సెక్యూరిటీ, గోదావరి ఘాట్స్ వద్ద సౌకర్యాలు వంటి ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రహదారులను తక్షణం మరమ్మతులు చేయడంతో పాటు, ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దసరా నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రద్దీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ పటాక్, ఏఎంసి చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్, ఆలయ ప్రత్యేక అధికారి సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజని దేవి, డిపి ఓ శ్రీనివాస్, తహసిల్దార్ పవనచంద్రతో పోలీస్, ఫైర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *