అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్లో నల్ల జెండాలతో ప్రదర్శన

భాగా హాజరైన విలేకరులు

మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఐజేయు నాయకులు

ఖమ్మం, మన ప్రజాపక్షం ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గళమెత్తారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. టియుడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఐజేయు నేతలు సంఘీభావం ప్రకటించి, నిరసనలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావడంతో ఖమ్మం జడ్పీ సెంటర్ నినాదాలతో దద్దరిల్లింది. జర్నలిస్ట్ సాంబశివరావుతో పాటు కెమెరామెన్ తమ విధుల్లో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం నారాయణ, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపటమే జర్నలిస్టుల డ్యూటీ అని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అవమానించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కావాలని, దురుద్దేశపూర్వకంగానే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుతో తప్పుడు కేసు పెట్టించారని ఫైరయ్యారు. ప్రభుత్వం తప్పులుంటే సరిదిద్దుకోవాలి తప్పించి, వార్తను రిపోర్టు చేసిన విలేకరులపై కేసులు పెడతారా అని మండిపడ్డారు. సాంబశివరావు, నాగరాజు పై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నర్వనేని వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరావు పాల్గొని ప్రసంగించారు. సోమవారం ఉదయం జర్నలిస్టు సాంబశివరావుతో పాటు ఆ ఛానల్ కెమెరామెన్, మరో సహాయకునిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలోని జిల్లా పరిషత్ (అంబేద్కర్) సెంటర్లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ దిన పత్రికలు, శాటిలైట్ చానళ్లకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, కేబుల్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (టీజెఎఫ్) జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, వనం నాగయ్య, ప్రశాంత్ రెడ్డి, శెట్టి రజనీకాంత్, జిల్లా నాయకులు అడపాల నాగేందర్, మందుల ఉపేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, ఆర్టివి జిల్లా ఇన్చార్జి ఉదయ్, అమరవరపు కోటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, కార్యదర్శి అశోక్, సీనియర్ జర్నలిస్టు రామిశెట్టి విజేత, సంతోష్, కాపర్తి నరేంద్ర, బిక్కి గోపి, ముత్యాల కోటేశ్వరరావు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఐజెయూ నేతలు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం భూపాల్, మహేందర్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, జిల్లా కోశాధికారి శివానంద, నగర అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్, నగర ప్రెస్ క్లబ్ కార్యదర్శి శీలం శ్రీనివాస్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *