నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నుండి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి, అదనపు కలెక్టర్లు అమరేందర్ సంబంధిత శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లోమంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం ద్వారా రాష్ట్రం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యధిక రికార్డు నమోదు చేసింది. అధిక దిగుబడి, అధిక కొనుగోళ్ల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా రవాణా వసతులు ఏర్పాటు చేయాలి.

రైతులు ఎక్కడా నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కోసం అవసరమైతే అదనపు ఖర్చులకు వెనకాడరాదని జిల్లాల కలెక్టర్లకు మంత్రులు సూచించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో వానకాలం ఖరీఫ్ సీజన్లో మొత్తం 1,62,097 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 4,53,873 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉండవచ్చని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో షామియానా, తాగు నీరు, విద్యుత్ వసతి, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ధాన్యం తూకంలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు జరగాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17లోపు ఉంచి కేంద్రాలకు తీసుకురావాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సమస్యలు రాకుండా ఎక్కువ లారీలను వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ అనంతరం 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, కామన్ రకానికి రూ.2369గా ధరలు నిర్ణయించబడ్డాయని మంత్రులు కు కలెక్టర్ తెలిపారు. వరి కొనుగోలు ప్రక్రియపై జిల్లాలో తాను ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేలా కృషి చేయనున్నట్లు మంత్రులకు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, డిఆర్డిఏ పిడి చిన్న ఓబులేసు, డిఎం సివిల్ సప్లై రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సిరంజిత్ సింగ్, జిల్లా కోపరేటివ్ అధికారి, వ్యవసాయ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




