బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :మంగళవారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో అమలు చేస్తున్న బాలశక్తి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ మొదటి దశలో భాగంగా జిల్లాలోని కేజీబీవీలలో విజయవంతంగా బాలశక్తి కార్యక్రమాన్ని అమలుపరిచామని అన్నారు. అదేవిధంగా జెడ్పీ పాఠశాలల్లో రెండో దశలో భాగంగా బాలశక్తి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు పూర్తి చేసిన వైద్య పరీక్షల వివరాలు మండలాల వారిగ సమీక్షించారు. విద్యార్థులందరికీ రక్తహీనత, థైరాయిడ్, పోషక లోపాల గుర్తింపు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో లోపాలు గుర్తిస్తే, వారికి ప్రత్యేక పోషక ఆహారంతో పాటుగా అవసరమగు మందులను అందివ్వాలన్నారు. ఎప్పటికప్పుడు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, వారి ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు వస్తుందో, లేదో చూడాలన్నారు. అన్ని వివరాలు వారి హెల్త్ కార్డుల్లో నమోదు చేస్తూ ఉండాలన్నారు. విద్యార్థుల పోషకులతో సమావేశాలు నిర్వహించినప్పుడు వారి ఆరోగ్య విషయాలు పోషకులకు వివరించాలన్నారు. ఒత్తిడిని అధిగమించుట, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మానసిక ఆరోగ్యం, తదితర అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వయంగా బ్యాంకులకు విద్యార్థులను తీసుకువెళ్లి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, సామాజిక అంశాలపై విద్యార్థులకు అన్ని వివరాలు తెలిసేలాగా ప్రభుత్వ కార్యాలయాలకు, వైజ్ఞానిక యాత్రలకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈఓ భోజన్న, డిఆర్డివో విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ రాజేందర్, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *