శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం

కేరళ, మన ప్రజాపక్షం : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతైన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.”ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం. దీనిపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలి” అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది.ఈ వివాదం 2019లో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు చర్యలతో మొదలైంది. స్పెషల్ కమిషనర్‌కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారు ఈ బంగారు రేకులను తొలగించారు. ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి వెళ్లడంతో, దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *